ఏపీ సీఎం చంద్రబాబు.. ఆటోడ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్ర మంలో `ఆటో డ్రైవర్ల సేవలో..` అనే వినూత్న పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం కింద.. ఆటో, ట్యాక్సీ, క్యాబ్, త్రీవీలర్ పాసింజర్ వెహికల్స్ నడిపే డ్రైవర్లకు.. రూ.15 వేల చొప్పున అందిం చనున్నారు. మొత్తం 2.9 లక్షల మంది డ్రైవర్లను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి తక్షణమే ఆ నిధులు వారి వారి ఖాతాల్లో పడేలా చంద్రబాబు దీనిని ప్రారంభించారు.
అనంతరం సీఎం చంద్రబాబు ఆటోడ్రైవర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పలు వరాలు ప్రకటించారు. ప్రస్తుతం ర్యాపిడో, ఓలా వంటి యాప్‌ల ద్వారా రవాణా సేవలపు ప్రజల ముంగిటికే వచ్చిన నేపథ్యంలో ఆటో స్టాండ్లలో ఎక్కువ సేపు వేచి ఉన్నా.. డ్రైవర్లకు గిరాకీ లభించడం లేదన్న ఆయన.. ఇక నుంచి ప్రభుత్వమే.. ఒక కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ఈ యాప్‌లో 2.9 లక్షల మందిని యాడ్ చేస్తారని.. వీరికి ఆయా ప్రాంతాల్లో కిరాయిలు లభించేలా చేస్తామని తెలిపారు.
అదేసమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీనిలో ఆయా సంఘాలను సభ్యులుగా చేర్చడం ద్వారా ఆటో డ్రైవర్ల సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. అలాగే.. ప్రస్తుతం ఉన్న సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే ఆటోలను త్వరలోనే బ్యాటరీ, విద్యుత్ వాహనాలుగా దశల వారీగా మార్చనున్నట్టు సీఎం చెప్పారు. వీటికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
అదేవిధంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆరోగ్య సంజీవని బీమాను అమలు చేస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్లలో వారి పిల్లలకు ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఆటో డ్రైవరు నిర్భయంగా జీవించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రస్తుతం ఆటోడ్రైవర్లు.. పడుతున్న కష్టాలను త్వరలోనే మరిన్ని పథకాలతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.