ఎక్కడ ఎలాంటి చిన్న అవకాశం చిక్కినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తా యి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అయితే.. పార్టీలు అనుసరించే విధానాలు .. వేసే అడుగులు కూడా భిన్నంగా ఉంటాయి. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహారం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. తమను చీకొట్టినా.. ఛ కొట్టినా.. అవసరం అనుకుంటే. ఏ పార్టీతో అయినా.. చేతులు కలుపుతుంది. ఇప్పుడు తమిళనాడులోనూ ఇదే జరుగుతోంది.
ఆది నుంచి బీజేపీని వ్యతిరేకించిన.. ఇళయ దళపతి, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, నటుడు విజయ్ తో చెలిమికి బీజేపీ రెండు చేతులు చాపిందన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి విజయ్‌తో చెలిమి కి ఇప్పుడే కాదు.. ఆయన 2024, ఫిబ్రవరిలో పార్టీ పెట్టినప్పుడు.. అప్పట్లో బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న మాజీ ఐపీఎస్.. అన్నామలైతోనే రాయబారాలు నడిపారు. తమతో కలిసి రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మీరే సీఎం అభ్యర్థి అని కూడా కమల నాథులు అప్పట్లో సమాచారం ఇచ్చారు.
కానీ, నాస్తికుడు అయిన.. విజయ్.. బీజేపీకి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన పలు సభల్లోనూ ప్రకటించారు. దీంతో బీజేపీ మౌనంగా ఉండిపోయింది. అయితే.. కాలం అన్ని వేళలా ఒకే రకంగా ఉండ దు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. రాష్ట్రంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడం.. హైకోర్టు ఈ విషయంపై సీరియస్ కావడం.. విజయ్‌పై కేసు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించ డంతోవిజయ్ ఇరుకున పడ్డారు. మరో 7 మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయనకు కలిసి వచ్చే పార్టీ, నాయకులు కూడా కావాలి.
ఈ క్రమంలోనే బీజేపీ మరోసారి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ దఫా విజయ్ అనుమతి కానీ.. ఆయన అంగీకారం కానీ.. తీసుకోకుండానే.. బీజేపీ పెద్దలు ఆయనకు అనుకూలంగా మాట్లాడాలని.. రాష్ట్ర నేతలకు సంకేతా లు ఇచ్చారు. ఇంకేముంది.. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నాయకులు విజయ్ తప్పులేదని.. డీఎంకేదే తప్పు అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. బీజేపీ నేతృత్వంలో.. ఓ కమిటీ నిజనిర్ధారణ చేస్తోంది . ఈ కమిటీ రిపోర్టు కూడా.. విజయ్‌కు అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.
ఈ పరిణామాలతో విజయ్ ఇక, బీజేపీ కౌగిలి నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్ ఆలోచన ఎలా ఉందో చూడాలి. కాగా.. వచ్చే ఏడాది మార్చిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఇక్కడ డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయి. ఇదేసమయంలో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు జట్టుకట్టాయి. ఈ కూటమిలోకి విజయ్‌ను తీసుకురావడం ద్వారా విజయం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.