2024లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ ఐటీ సంస్థలు మొదలు భారీ పరిశ్రమలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా కంపెనీలు, ఇండస్ట్రీలు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ కూడా ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓ పక్క విదేశీ పర్యటనలతో మరోపక్క స్వదేశంలో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో లోకేష్ నేడు భేటీ అయ్యారు.
ఏపీలో విశాఖపట్నంలో త్వరలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావలసిందిగా టాటా గ్రూప్ ప్రతినిధులను లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూపు భాగస్వామి కావాలని కోరారు. శ్రీ సిటీలో ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించాలని కూడా కోరారు. టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఓఎస్టిఏ ఏర్పాటు చేయాలని. ముంబైలో జరిగిన ఈ భేటీలో టాటా పవర్స్ రెన్యువల్స్ సీఈఓ సంజయ్ కుమార్, ఇండియా హోటల్స్ ఎండి పునీత్ తదితరులు కూడా పాల్గొన్నారు.