ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో సత్తా చాటగలవని చాటి చెప్పింది విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. టీడీపీ స్థాపించి ఢిల్లీ గద్దెను గడగడలాడించారు. ఆ తర్వాతే దేశంలో ఎస్పీ, బీఎస్పీ వంటి పలు ప్రాంతీయ పార్టీలు పుట్టుకువచ్చాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేసి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పనులు చేయించుకోవచ్చని అన్న ఎన్టీఆర్ నిరూపించారు. కట్ చేస్తే...తాజాగా అదే విషయాన్ని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీ టీడీపీ బలంగా ఉందని, అందుకే కేంద్రం మెడలు వంచి పనులు చేయించుకుంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
టీడీపీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకోవాలని హరీష్ రావు సూచించారు. ఏపీలో టీడీపీ బలంగా ఉంది కాబట్టే కేంద్రం నుంచి సహకారం అందుతోందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
కనీసం యూరియా కూడా సరిగా సరఫరా చేయలేకపోయిందని, రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ తెలుస్తుందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కార్యకర్తలతో అన్నారు.