బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేపట్టడం, దానిపై దుమారం రేగడం, త్వరలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపడతామని సీఈసీ ప్రకటించడంతో ఆ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీ మొదటి విడత, నవంబర్ 11వ తేదీ రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇక, బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా 8 చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో జూబ్లీహిల్స్ తో పాటు మరో 7 స్థానాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ను సీఈసీ విడుదల చేసింది. మరోవైపు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదలు దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల నిర్వహణలో 17 సరికొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.
ఆ 17 ముఖ్యమైన సంస్కరణలు ఇవే:
ఓటరుగా పేరు నమోదు చేసుకుని.. ఆమోదం పొందిన 15 రోజుల్లోనే ‘EPIC కార్డు’ (ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు) డెలివరీ చేయనున్నారు.
ప్రస్తుతం ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ 1,500 మంది ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం కల్పించగా.. రద్దీని తగ్గించేందుకు దాన్ని 1,200కు తగ్గించనున్నారు.
సాధారణంగా బిహార్ ఎన్నికలను మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ సారి రెండు దశల్లోనే పూర్తి చేయనున్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లపై పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించనున్నారు.
పోటీ చేసే అభ్యర్థుల సీరియల్ నెంబర్‌ను కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి అధికారులను(బీఎల్‌ఓ) సులభంగా గుర్తించేందుకు వారికి అధికారికంగా ఐడీ కార్డులను జారీ చేయనున్నారు. బీఎల్‌ఓలకు ఢిల్లీలో ట్రైనింగ్.
ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు.
ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకత కల్పిస్తూ అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ పూర్తిగా వెబ్‌కాస్టింగ్ కవరేజ్ ఉంటుంది.
ఈసీఐనెట్ యాప్ (ECINET APP) ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి గురించి అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఓటింగ్ సమయంలో ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ యాప్‌లో ఓటింగ్ డేటా అప్‌డేట్ అవుతుంది.
కొత్తగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను ఇవ్వనున్నారు. వాటిపై ఓటరు ఐడీ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది.
అభ్యర్థులను పోలింగ్ స్టేషన్ల నుంచి 100 మీటర్ల దూరం వరకే అనుమతించనున్నారు.
చివరి రెండు రౌండ్ల ఈవీఎంల లెక్కింపునకు ముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును తప్పనిసరి చేశారు. దీంతో రిజల్ట్స్ మరింత పారదర్శకంగా ఉంటాయని చెబుతున్నారు.
ఈవీఎంల డేటా సరిపోలడం లేదంటూ ఫిర్యాదులు వచ్చినపుడు వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా వెరిఫై చేయడం వంటి సరికొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్లు సీఈసీ ప్రకటించారు.
బూత్ లెవల్ ఆఫీసర్ల పారితోషికం రెట్టింపు. తొలిసారిగా ఈఆర్వో, ఏఈఆర్వోలకు గౌరవ వేతనం అందించనున్నారు.