2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఓ వైపు ఏపీకి పెట్టుబడులు తేవడంతో పాటు మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే హైకోర్టు, ఉద్యోగుల భవనాలతో పాటు పలు నిర్మాణాల పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఇక, అమరావతిలో తమ ప్రధాన కార్యాలయాలు నిర్మించేందుకు ఎస్బీఐ సహా పలు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి, సీఆర్డీఏ పరిధిలో ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కంపెనీల చట్టం కింద ప్రత్యేక వాహక సంస్థ (SPV) ఏర్పాటుకు పురపాలకశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10 కోట్ల అధీకృత షేర్ క్యాపిటల్‌తో ఎస్పీవీ ఏర్పాటు కానుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి 99.99 శాతం ఈక్విటీ భాగస్వామిగా, మిగతా 0.01 శాతం ఈక్విటీ సీఆర్‌డీఏ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందేలా ఎన్సీబీ ఏర్పాటవనుంది. ఎస్పీవీ ద్వారా అమరావతిలో పలు ప్రధాన ప్రాజెక్టులు చేపట్టనున్నారు. భవిష్యత్తులో చేపట్టే ఇతర ప్రత్యేక ప్రాజెక్టులు కూడా ఎస్పీవీ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.
* గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం
* నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం
* స్మార్ట్ ఇండస్ట్రీలు
* కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్
* స్పోర్ట్స్ సిటీ
* రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్
* రోప్ వే
* అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్
ఎస్పీవీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, కొందరు అధికారులు బోర్డు సభ్యులుగా ఉంటారు
* ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
* ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి
* రవాణా-రోడ్లు శాఖ ముఖ్య కార్యదర్శి
* భవనాలు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు
* సీఆర్‌డీఏ కమిషనర్
ఎస్పీవీ బాధ్యతలు
* రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ సమన్వయంతో ప్రత్యేక ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి, అమలు.
* సబ్సిడరీలు/ జాయింట్ వెంచర్ల రూపంలో ప్రాజెక్టుల నిర్వహణ.
* కొత్త ప్రాజెక్టుల కాన్సెప్ట్‌లు, ఫీజిబిలిటీ రిపోర్టులు, డీపీఆర్‌లు, ఆర్థిక నమూనాలు రూపొందించి ప్రభుత్వ అనుమతులు పొందడం
* పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్ల ద్వారా కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక, నిర్మాణం, నిర్వహణ.