ప్రభుత్వ ఉద్యోగులు, టీటీడీ ఉద్యోగులు తమ వృత్తి ధర్మం ప్రకారం బాధ్యతతో వ్యవహరించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు. తమ వ్యక్తిగత ఎజెండా, పార్టీ ఏదైనప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచడం వారి విధినిర్వహణలో భాగం. కానీ, టీటీడీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా టీటీడీలో అత్యంత కీలకమైన సమాచారం లీక్ అయిన వైనం షాకింగ్ గా మారింది. ఈ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
ఇంకా తేదీ కూడా ఖరారు కాని టీటీడీ పాలకమండలి సమావేశం ఎజెండా వివరాలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి బట్టబయలు చేయడంపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే దాదాపు 45 మంది ఉద్యోగులపై వారం రోజుల్లో వేటు వేయబోతున్నామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. కోయంబత్తూరుకు చెందిన జీ స్క్వేర్ అనే సంస్థ ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చిందని, ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారని ఆరోపించారు.
ఈ అంశాన్ని త్వరలో జరగబోయే టీటీడీ బోర్డు సమావేశంలో 24వ ఎజెండాగా చేర్చారని కూడా భూమన అన్నారు. కానీ, టీటీడీ పాలకమండలి సమావేశం తేదీ , ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. సీక్రెట్ గా ఉండాల్సిన ఎజెండా వివరాలు భూమనకు ఎలా తెలిశాయన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీలోని బోర్డు సెల్‌లో ఉన్న కొందరు కీలక అధికారులు ఈ సమాచారాన్ని చేరవేశారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన వర్గీయులు టీటీడీలో 2,000 మందికి పైగా ఉన్నారని భూమన గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.
రకరకాల కారణాలతో 45 మంది ఉద్యోగులపై వారం రోజుల్లో కఠిన చర్యలు తీసుకోబోతున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. జీ స్క్వేర్ సంస్థకు చెందిన దాత సుమారు 50 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయం నిర్మించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఆగమశాస్త్రం ప్రకారం ప్రణాళిక ఇవ్వమని మాత్రమే టీటీడీని కోరారని నాయుడు తెలిపారు.