జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ను ఏరకంగా అవమానించారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. దళితుడైన డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై పెడ రెక్కలు విరిచి మరీ అరెస్టు చేసిన వైనం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయడం, సస్పెండ్ చేయడం వంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా సుధాకర్ కుంగికృశించి చనిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్‌కు నర్సీపట్నంలో నిరసన తెలిపేందుకు దళిత సంఘాలు రెడీ అవుతున్నాయి. జగన్ పర్యటనను అడ్డుకుని తీరుతామని పలు దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు సుధాకర్ కుటుంబానికి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్ ప్రభుత్వమే కారణమని, ఒక మాస్క్, పీపీఈ కిట్ అడిగినందుకు ఆయనను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిజం ప్రపంచమంతటికీ తెలుసని, ఒక డాక్టర్ ప్రాణాలకే రక్షణ లేదని, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తామని జగన్ చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అన్యాయాన్ని దళిత సమాజం మరచిపోలేదని అన్నారు. సుధాకర్ కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అంగీకరించి, సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, లేదంటే జగన్ పర్యటనను దళిత సంఘాల ఆధ్వర్యంలో కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. చూస్తుంటే జగన్ ను డాక్టర్ సుధాకర్ వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.