ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాద ఘటన జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడ సజీవ దహనమయ్యారు. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు చనిపోయారు. ఈ ప్రమాద సమయంలో 40 మంది లోపల పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ పేలుడు ధాటికి ఆ బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన స్థలాన్ని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలు, వైద్యసాయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలలో పాల్గొనాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు.