ఏపీకి పెట్టుబడులు తేవడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పోటీపడుతున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడుల వేటలో కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి అతి పెద్ద విదేశీ పెట్టుబడిని ఆకర్షించడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారు. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏపీలో రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో, శభాశ్ లోకేశ్ అంటూ చంద్రబాబుతో పాటు మంత్రులంతా లోకేశ్ ను అభినందించారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడింది. 67 వేల ఉద్యోగాల అంచనాతో ఆ పెట్టుబడులు రానున్నాయి. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. రూ. 87,520 కోట్ల పెట్టుబడితో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు అతి పెద్ద ఘనతగా SIPB భావిస్తోంది.
15 నెలల పాలనలో పెట్టుబడుల అన్వేషణలో భాగంగా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీటో కంపెనీలు త్వరితగతిన తమ ప్రాజెక్టులు ప్రారంభించేలా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిపారు చంద్రబాబు. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించాలని, కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా జరిగిన ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.