మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ దూషించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దున్నపోతు అంటూ లక్ష్మణ్ పై పొన్నం నోరు పారేసుకున్నారని కొన్ని పత్రికల్లో ప్రచారం జరిగింది. అయితే, తాను ఆ మాట అనలేదని, లక్ష్మణ్ ను దూషించలేదని పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. కానీ, ఆ వివాదం సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ కు పొన్నం వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. తాను ఆ మాట అనలేదని, అయినా సరే క్షమాపణలు చెబుతున్నానని పొన్నం అన్నారు.
పత్రికలలో వచ్చిన కథనాలతో అడ్లూరి మనస్థాపం చెందారని, కాబట్టి సారీ చెబుతున్నానని అన్నారు. మంత్రి అడ్లూరికి, తనకు రాజకీయాలకు అతీతంగా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కరీంనగర్ లో కలిసి పెరిగామని అన్నారు. తమ ఇద్దరికీ పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఇక, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, వివాదానికి ముగింపు పలకాలని తన అనుచరులకు, అభిమానులకు, దళిత సంఘాల నేతలకు అడ్లూరి లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు, తనపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేశారు. పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్యలు తనను బాధించాయని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే తదనంతర పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి తన నివాసంలో వీరిద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది.