విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించడకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల నిలిపివేత వంటి ఆరోపణలు మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంపై వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంబీ యూనివర్సిటీపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) రూ.15 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,1752,872 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ వివరాలు తాజాగా వెబ్సైట్లో ఉంచడంతో ఈ వ్యవహారంపై మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై యూనివర్సిటీ ప్రో-చాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. ఎంబీ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కొన్ని సిఫార్సులు మాత్రమే చేసిందని గుర్తు చేశారు. ఆ సిపార్సులను వర్సిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ విషయం ఏపీ హైకోర్టులో విచారణలో ఉందని, ఆ సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు స్టే' ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి ఆ వివరాలు పోర్టల్ లో పెట్టడం దురదృష్టకరమని అన్నారు. తమ వర్సిటీ పరువుప్రతిష్ఠలు దిగజార్చడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.