అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే మరోలాగా ప్రవర్తించడం వైసిపి అధినేత జగన్ కు పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి వీడి వెళ్లని జగన్...ఆ పదవి కోల్పోయిన వెంటనే రాష్ట్రం దరిదాపుల్లో లేకుండా కర్ణాటకకు మకాం మార్చారని విమర్శలు వస్తున్నాయి. బెంగళూరులోని ఎలాహంక ప్యాలెస్ కు షిఫ్టయిన జగన్ అప్పుడప్పుడు టూరిస్ట్ లాగా ఏపీకి వచ్చి వెళ్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ వి వీకెండ్ పాలిటిక్స్ అని గంటా ఎద్దేవా చేశారు. పర్యటనల పేరుతో జగన్ హడావిడి చేస్తున్నారని చురకలంటించారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, జగన్ పరామర్శలకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చిందని గంటా గుర్తు చేశారు. సత్తెనపల్లితో పాటు గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, నెల్లూరు పట్టణంలో జగన్ టూర్లకు పోలీసులు అనుమతినిచ్చారని అన్నారు.
విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని వైసిపి అడ్డుకుంటోందని, పోలీసుల అనుమతులు లేకున్నా సరే మాకవరపాలెంలో జగన్ టూర్ కి భారీగా జన సమీకరణ చేస్తుందని ఆరోపించారు. అదే రోజు మహిళలు క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ విశాఖలో జరుగుతుందని, భద్రతా కారణాల రీత్యా జగన్ పర్యటనకు అనుమతి లేదని గుర్తు చేశారు. కానీ, వైసీపీ నేతలు ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని గంటా హెచ్చరించారు.