మాజీ సీఎం జగన్ హయాంలో భారతి సిమెంట్స్ కోసం నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతి సిమెంట్స్ తో పాటు పలు సిమెంట్ కంపెనీలకు సరఫరా అయ్యే సున్నపు గనుల లీజుల మంజూరులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ అవకతవకలపై విచారణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రత్యేకించి భారతి సిమెంట్స్‌కు 2024 ఎన్నికలకు ముందు మంజూరు చేసిన రెండు లీజులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర గనుల శాఖ అభ్యంతరాలు, అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను గత ప్రభుత్వం తుంగలో తొక్కింది. భారతి సిమెంట్స్‌కు కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో విస్తీర్ణం 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల భూమి ఉంది. భారతి సిమెంట్స్‌తో పాటు ఏసీసీ, రామ్‌కో సిమెంట్స్ కు కూడా ఈ తరహా లీజులు ఇచ్చినట్లు గుర్తించారు.