ఏపీలో ఇటీవల వెలుగు చూసిన నకిలీ మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-21గా ఉన్న అష్రఫ్ ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం.. తంబళ్లపల్లి తహసీల్దార్ వద్ద హాజరు పరిచి.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు అరెస్టు అయ్యారు. ఇక, అష్రఫ్ విషయానికి వస్తే.. ఈయన టీడీపీ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన.. జయచంద్రారెడ్డికి కారు డ్రైవర్‌గా వ్యవహరించాడని పోలీసులు చెబుతున్నారు.
పేరుకు మాత్రమే కారు డ్రైవర్ అని.. నకిలీ మద్యం తరలింపు.. ఎక్కడెక్కడికి చేర్చాలి.. కాల్ వ్యవహారాలు.. నగదు బదిలీ.. ఇలా.. అన్ని పనుల్లోనూ అష్రఫ్‌కు ప్రమేయం ఉందని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత.. పారిపోయిన అష్రఫ్.. స్థానికంగా ఉన్న ఓ ఆటో స్టాండ్‌లో మారు వేషంలో తిరుగుతున్నాడని తెలిపారు. విషయం తెలుసుకుని అతనిని అరెస్టు చేసినట్టు వివరించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన జయచంద్రారెడ్డి, ఆయన బంధువు కూడా ఈ కేసులో ప్రధాన పాత్ర ధారులేనని పోలీసులు తెలిపారు. అయితే.. వారిద్దరూ ఈ కేసు వెలుగులోకి రాగానే రెండు మూడు రోజులు అందుబాటులోనే ఉన్నా.. తర్వాత తప్పించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారిని బెంగళూరు లో ఉన్నట్టుగా గుర్తించి.. అక్కడకు ప్రత్యేక బృందాలను పంపించినట్టు పోలీసులు వివరించారు. 24 గంట ల్లోగా వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
ఇదిలావుంటే.. నకిలీ మద్యం కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వంఈ వ్యవహారంలో ఎవరి ప్రమే యం ఉన్నా.. వదిలి పెట్టొద్దని పేర్కొంది. ఇదేసమయంలో మూలాలను గుర్తించాలని కూడా పోలీసులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా వైసీపీ నాయకుల ప్రమేయం.. వారి ఆనవాళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎవరి విషయంలోనూ రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.