2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలను విశాఖకు ఆహ్వానించడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సక్సెస్ అయ్యారు. అమెరికా పర్యటనలు, దావోస్ సదస్సు నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలను లోకేశ్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
నాస్డాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏఫీలో పెట్టుబడులు పెట్టింది. 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఈ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. 1000 మందికి ఉపాధి లభించేలా ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో, గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోనుంది.