ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వానికి భిన్నంగా కల్తీ మద్యం తయారు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం తక్షణమే కేసు పెట్టింది. తమ పార్టీ వాళ్లయినా సరే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు గట్టి మెసేజ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కల్తీ మద్యం తయారు చేసేవారికి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ మద్యం తయారు చేసేవారికి అదే ఆఖరి రోజని
చంద్రబాబు హెచ్చరించారు.
ములకలచెరువులో నకిలీ మద్యం తయారుచేసిన వారిని పట్టుకుని కేసులు పెట్టామని, ఆ వ్యవహారంలో టీడీపీ నాయకులున్నా సరే ఉపేక్షించకుండా అరెస్టు చేసి, కఠినంగా వ్యవహరించామని గుర్తు చేశారు. అయినా సరే కొందరు ఆ విషయంతో శవ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. జగన్ హయాంలో మద్యం విధానంలో చాలా అవకతవకలు జరిగాయని, గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు తీశారని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వంలో అలాంటి వాటిని ఉపేక్షించేది లేదు" అని ఆయన స్పష్టంచేశారు. నెల్లూరులో సాధారణ మరణం సంభవిస్తే... నకిలీ మద్యం తాగి చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైకాపా నాయకులు, పార్టీ అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు నిప్పులు చెరిగారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలోనే ప్రభుత్వం ఓ యాప్ తీసుకువస్తుందని, మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు తెలుసుకునేలా యాప్ రూపొందిస్తున్నామని వివరించారు.