ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా.. రాష్ట్రాన్ని పాలించే వారిగా ముఖ్యమంత్రుల పనితీరు పారదర్శకంగా ఉం డాలి. అది ఏ రాష్ట్రమైనా.. ఏ ప్రాంతమైనా.. బాధితులకు ముఖ్యమంత్రుల ప్రవర్తన ఊరటకల్పించాలి. కానీ.. పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సామూహిక అత్యాచారాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా జరిగిన ఒడిశా విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటన సర్కారు కు మరింత సెగ పెంచింది.
ఈ నేపథ్యంలో నలువైపుల నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలో మరింత సంయమనంతో వ్యవహరించాల్సిన సీఎం.. నోరు పారేసుకున్నారు. ``అసలు రాత్రి పూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకు వచ్చింది?. ఎవరు కాపాడుతారు?`` అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ``బాధితురాలు ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతోంది. అర్ధరాత్రి 12.30కి బయటకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?. బాధ్యత లేదా? నాకు తెలిసినంత వరకు ఈ ఘటన అటవీ ప్రాంతంలో చోటుచేసు కుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. దోషులను కఠినంగా శిక్షిస్తాం`` అని మమత అన్నారు.
అయితే.. మమత ఈ వ్యాఖ్యలకే పరిమితం కాలేదు. సదరు వైద్య విద్యార్థిని ఒడిశాకు చెందిన వ్యక్తి కావడంతో ఆ రాష్ట్రం నుంచి కూడా మమతపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఒడిశాలోనూ సామూహిక అత్యాచారం ఘటనలు జరుగుతున్నాయన్న మమత.. అక్కడి ప్రభుత్వం(బీజేపీ) ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. అంతేకాదు.. విద్యార్థులు సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వాలే చేయలేవని చాలా రోజులుగా చాలా ప్రభుత్వాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో తమపైనే విమర్శలు చేయడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు.
తీవ్రస్థాయిలో విమర్శలు..
కాగా.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలు... తీవ్ర దుమారం రేపాయి. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వానికి, ఆమెకు ఎంత రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటనను ఇలా రాజకీయాలకు ఎలా వాడుకుంటారన్న ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. మహిళా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ అయి ఉండి.. విద్యార్థినుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు.