ఏదైనా ఒక ఐటీ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. స్వదేశంపై అభిమానంతో తమకు ఎంతో ఇచ్చిన రాష్ట్రానికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలన్న గొప్ప సంకల్పంతో చాలామంది ఎన్నారైలు ఏపీలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు విశేష కృషి చేస్తుంటారు. అలా ఎన్ఆర్ఐ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేనితో పాటు మరికొంతమంది ఎన్నారైలు, తదితరులు చేసిన కృషి వల్లే విశాఖలో సిఫీ టెక్నాలజీస్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సాగర్ దొడ్డపనేని కృషిని సిఫీ టెక్నాలజీస్ ఛైర్మన్ రాజు వేగేశ్న, మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
2017లో కాలిఫోర్నియాలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్నను తాను మొట్టమొదటిసారి కలిశానని లోకేశ్ చెప్పారు. అప్పటి నుంచి ఈ ప్రయాణం మొదలైందని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఏపీలో ఆయనతో పెట్టుబడి పెట్టించేందుకు తనకు 8 ఏళ్లు పట్టిందని చెప్పారు. అయితే, ఈ పెట్టుబడులు ఒక్కరోజులో రాలేదని తెలిపారు. ఈ పెట్టుబడుల వెనుక ఎంతోమంది కృషి ఉందని అన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు ఈ ప్రాజెక్ట్ ను విశాఖపట్నానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సాగర్ దొడ్డపనేనితో పునాదిరాయిని లోకేష్ స్వయంగా దగ్గరుండి వేయించారు.
ఇక, సాగర్ దొడ్డపనేనిపై సిఫీ టెక్నాలజీస్ ఛైర్మన్ రాజు వేగేశ్న కూడా ప్రశంసలు కురిపించారు. వైజాగ్ లో సిఫీ టెక్నాలజీస్ పెట్టుబడులు పెట్టడం వెనుక తన మిత్రుడు సాగర్ దొడ్డపనేని కృషి ఉందని అన్నారు. ఫ్రీమాంట్ లో తాను గుడి కట్టానని, అప్పటి నుంచి సాగర్ దొడ్డపనేని తనకు టెంపుల్ ఫ్రెండ్ అని రాజు వేగేశ్న అన్నారు. భారత్ లోని చాలా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టాలని సాగర్ తనను అడిగారని చెప్పారు.
6 నెలల క్రితం సాగర్ తో కలిసి తాను లోకేశ్ ను కలిశానని గుర్తు చేసుకున్నారు. అన్న మీరు ఏపీలో పెట్టుబడులు పెట్టండి..మీకు అన్ని విధాల సహకరిస్తామని లోకేశ్ చెప్పారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ తపన చూసి తాను విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నానని అన్నారు. సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యానని తెలిపారు. హైదరాబాద్ ఐటీ రంగాన్ని చంద్రబాబు ఏ విధంగా డెవలప్ చేశారో, ఆయన కఠోర శ్రమ, విజన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ప్రశంసించారు. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా హైదరాబాద్ మాదిరి వైజాగ్ ను డెవలప్ చేసేందుకు కంకణం కట్టుకున్నారని కితాబిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఐటీ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.