విశాఖను ఏపీ ఆర్థిక రాజధానిగా చేస్తామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంతేకాదు, 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని...అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ విధానమని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని, విశాఖను అభివృద్ధి చేసేందుకు పదేళ్ల సమయం చాలని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి దక్కించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నగరంగా విశాఖ చరిత్రపుటల్లో నిలిచిపోయాయన్నారు.
విశాఖలో డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రారంభించిన తర్వాత లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1990లో సీఎం చంద్రబాబు కృషితో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయని, దీంతో, ఆయన సైబర్ టవర్స్ ను నిర్మించారని చెప్పారు. సైబర్ టవర్స్ తర్వాత అనేక సంస్థలు హైదరాబాద్ కు వచ్చి ఆ నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే, ఆ రేంజ్ లో డెవలప్ అయ్యేందుకు విశాఖకు పదేళ్లకు మించి పట్టదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు తమ ప్రభుత్వానికున్న కమిట్ మెంట్. శ్రమను ప్రజలు గుర్తించాలన్నారు.
సమర్థ పాలనకు, ఉద్యోగాల సృష్టికి, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని తెలిపారు.విశాఖ ప్రజలు ఎప్పుడూ టీడీపీతోనే ఉన్నారని, నగరంపై తనకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని అన్నారు. గడచిన 17 నెలల్లో ఏపీకి వచ్చిన 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కు వచ్చాయని, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు వస్తోందని తెలిపారు. సూపర్ సిక్స్ హా ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.
టీసీఎస్ కు 99 పైసలకే భూమి కేటాయించారని విమర్శలు వస్తున్నాయని, కానీ, ఆ నిర్ణయం వల్ల కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వచ్చాయని గుర్తు చేశారు. విశాఖకు ఇది ఎంతో కీలకమైన సమయమని, డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తోందని తెలిపారు. కేంద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణల్లో ఏపీకి ప్రధాని మోదీ ప్రాధాన్యతనిస్తున్నారని, విశాఖలో 3 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించామని అన్నారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.11వేల కోట్ల సాయం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు అందించిందని అన్నారు. రూ.14వేల కోట్ల సాయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, ఇది కేవలం ఏపీ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. రాబోయే 3 నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది తొలి అడుగు మాత్రమేనని అన్నారు.
నాస్డాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏఫీలో పెట్టుబడులు పెట్టింది. 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఈ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. 1000 మందికి ఉపాధి లభించేలా ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో, గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోనుంది.