ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆ కేసులో అరెస్టయిన నిందితుడు జనార్దన్ రావు చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక మాజీ మంత్రి జోగి రమేశ్ ఉన్నారని, ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను నకిలీ మద్యం తయారు చేశానని వీడియో రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకే జోగి రమేశ్ తమను ప్రోత్సహించారని అన్నారు.
వైసీపీ హయాంలో తాము కల్తీ మద్యం తయారు చేసి కూటమి సర్కార్ వచ్చాక ఆపేశామని చెప్పారు. కానీ, కూటమి ప్రభుత్వంపై కుట్ర చేసేందుకు జోగి రమేశ్ ప్లాన్ వేశారని, ముందుగా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని, అయితే, చంద్రబాబుపై బురద జల్లేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె సరైన ప్రదేశమని జోగి రమేశ్ చెప్పారని అన్నారు. ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారని, ఈ ప్లాన్ లో భాగంగానే తనను ఆఫ్రికాలోని తన మిత్రుడి వద్దకు పంపించారని ఆరోపించారు.
రైడ్‌కు ముందురోజు ఇబ్రహీంపట్నంలో సరుకు పెట్టించి, ఆ తర్వాత సాక్షి మీడియాకు సమాచారం ఇచ్చి రైడ్ చేయించింది కూడా జోగి రమేశ్ అని, అనుకున్నట్లే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని ఆరోపించారు. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని తన సోదరుడిని కూడా ఇరికించారని, చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ తనను మోసం చేయడంతోనే బయటకు వచ్చి నిజాలు చెబుతున్నానని జనార్దన్ రావు అన్నారు.