ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు బేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు వారిద్దరూ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఏఫీకి నిధులు, అమరావతి రాజధాని నిర్మాణ పనులు వంటి అంశాలతోపాటు నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025కు అధ్యక్షత వహించాలని మోదీని చంద్రబాబు కోరారు. అదేవిధంగా కర్నూలులో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' పేరుతో త్వరలో నిర్వహించబోతున్న కార్యక్రమానికి కూడా రావాలని ఆహ్వానించారు.
ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా తెచ్చిన నూతన తరం జీఎస్టీ సంస్కరణలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన వస్తోందని, అందుకే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని మోదీకి చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరాల ప్రజా సేవను పూర్తి చేసుకున్న మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రధాని నాయకత్వాన్ని చంద్రబాబు అభినందించారు.
మోదీతో చంద్రబాబు ఏకాంత భేటీ తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు...మోదీని కలిశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రతిమను మోదీకి చంద్రబాబు అందజేశారు.