తల్లిదండ్రుల ఆస్తి కావాలే కానీ వారు అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించే తీరు కొందరి పిల్లల్లో ఉంటుంది. ఇలాంటి వారు తమ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన సంపదను సొంతం చేసుకోవటం మీద చూపించే ఆత్రుత.. వారి బాగోగులు చూసే విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోరు. ఇలాంటి తీరుతో వ్యవహరిస్తున్న తన సంతానానికి సంబంధించి హనుమకొండ జిల్లాకు చెందిన ఒక తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారటమే కాదు..
అందరిని ఆకర్షిస్తోంది. ఆస్తులు తప్పించి.. బాధ్యతలు పట్టని పిల్లలకు ఇలాంటి షాకులు ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి.. వసంత దంపతులకు ఒక కొడుకు.. కూతురు ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఎల్కతుర్తి ఎంపీపీగా సేవలు అందించిన శ్యాంసుందర్ రెడ్డి తన కుమార్తెకు పెళ్లి చేయటం.. ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. కొడుకు రంజిత్ రెడ్డి సైతం అమెరికాలోనే స్థిరపడ్డారు. అయితే.. 2016లో కొడుకు ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటినుంచి హనుమకొండలో ఉన్న సొంతిట్లో భార్యా.. పిల్లలతో కలిసి ఉంటున్నారు.
ఇదిలా ఉండగా 2021లో శ్యాంసుందర్ రెడ్డి సతీమణి వసంత మరనించారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఎల్కతుర్తిలో ఉన్న తన పాత ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. కొడుకు తన బాగోగులు చూసుకోవటం లేదన్నది శ్యాంసుందర్ రెడ్డి వాదన. తన ఆస్తుల్ని కొడుకు తీసేసుకొని.. తనను పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో తన పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమిలో మూడు ఎకరాల్ని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ భూమి విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. తనకు చెందిన మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసి ఇస్తున్నట్లుగా వీలునామా రాసి.. ప్రభుత్వానికి అప్పగించారు. తల్లిదండ్రుల్ని మరిచే పిల్లలకు ఇలాంటి గుణపాఠాన్ని నేర్పాలని శ్యాంసుందర్ రెడ్డి పేర్కొంటున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.