తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో సంచలనంగా మారిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక నుంచి కేసీఆర్ ఫొటోను కూడా ఆమె పక్కన పెట్టనున్నట్టు సమాచా రం. ఈ ఏడాది ప్రారంభంలో `డియర్ డాడీ` పేరుతో ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత.. బీఆర్ ఎస్‌కు-కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్‌పై కాళేశ్వరం కమిషన్ విచారణ జరపడం, ఆయనపై కేసు పెట్టాలని సూచించిన నేపథ్యంలో కవిత మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హరీష్‌రావును కేంద్రంగా చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ ఎస్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. దరిమిలా.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే..ఆమె ఆ పార్టీకి, తన ఎమ్మెల్సీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాల తర్వాత.. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె మీడియాసమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర సమస్యలపైనా నిరసనలు చేపడుతున్నారు. అయితే.. ఎక్కడ ఎలాంటి సమావేశం నిర్వహించినా.. ఆమె పార్టీ నుంచి సస్పెండ్ కాకముందే.. బీఆర్ ఎస్ కండువాను, ఆ పార్టీ జెండాను కూడా పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి జెండాను మాత్రమే పట్టుకు న్నారు.
ఇక, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు జాగృతి వర్గాలు చెబుతున్నారు. ``సామాజిక తెలంగాణ సాధన లక్ష్యం`` పేరుతో ఈ నెల చివరి వారం నుంచి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల పాదయాత్రలు, మరికొన్ని చోట్ల బస్సు యాత్రలు మొత్తంగా పెద్ద ఎత్తున ఓ కార్యక్రమానికి కవితరూపకల్పన చేసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే మేధావులు, ప్రొఫెసర్లు, నాటి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఆమె కలుసుకుని వారి సలహాలు, సూచనలు తీసుకు న్నారు. ఈ క్రమంలో ఆమె ఏ విధంగా ఈ యాత్రను ముందుకు తీసుకువెళ్లాలన్న విషయంపై నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ఈ యాత్రలో కేసీఆర్ ఫొటోకు బదులుగా ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోను పెట్టుకుని ప్రజల మధ్యకువెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. అదేవిధంగా జాగృతి జెండాలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇక, ఈ యాత్ర అక్టోబరు చివరి వారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిరంతరాయంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాలను కవర్ చేస్తూ.. సాగనుందని జాగృతి వర్గాలు తెలిపాయి. అయితే.. ఇప్పటి వరకు కనీసం కేసీఆర్ ఫొటోతో అయినా.. ప్రెస్ మీట్ పెట్టిన కవిత.. ఇప్పుడు పూర్తిగా ఆయనను కూడా పక్కన పెట్టాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. మరి ఏమేరకు తెలంగాణ ప్రజలు కవితను రిసీవ్ చేసుకుంటారో చూడాలి.