ఏపీ సీఎం చంద్రబాబు విజన్, ఆయన నాయకత్వానికి గూగుల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మరో నిదర్శనమని ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు,కేంద్ర మంత్రుల సమక్షంలో గూగుల్ సహా దాని అనుబంధ సంస్థ రైడైన్‌లు.. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకోసం ఒప్పందం చేసుకున్నారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా వచ్చే రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు.. ఆసియాలోనే గూగుల్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం మరో విశేషం.
ఈ విషయంపై ఒకింత ఆలస్యంగా స్పందించిన పవన్ కల్యాణ్.. మంగళవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. చంద్రబాబు విజన్, ఆయన నాయకత్వానికి ఈ పెట్టుబడులు అద్దం పడుతున్నాయని తెలిపారు. అంతేకాదు.. వికసిత్ భారత్ దిశగా దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ పెట్టుబడులు కలిసి వస్తాయని తెలిపారు. విశాఖపట్నం ఏఐకి కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ``విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో పాటు భారతదేశ తొలి ఏఐ సిటీ ఏర్పాటు నిర్ణయం ముదావహమని పేర్కొన్నారు.
దేశ టెక్ రంగంలో ఈ ఒప్పందం ఒక కీలక చరిత్రాత్మక మైలురాయిగా పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దీని ద్వారా యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు, విద్యార్థులు ఇలా ప్రతి వర్గానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయాలు, సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. `ఏఐ ఫర్ ఆల్`(అందరికీ ఏఐ) దిశగా ఇది గొప్ప ముందడు గు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని.. అది రాష్ట్రానికి ఇలా అనేక రూపాల్లో మేలు చేస్తోందని తెలిపారు. ఆయన సమర్థ నాయకత్వంలో రాష్ట్రం మరింతగా పురోభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు.
మరోవైపు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైనా పవన్ కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. విశాఖలో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు వెనుక ప్రధాని ప్రయత్నం, సంకల్పం ఉన్నాయని తెలిపారు. ‘వికసిత భారత్’ లక్ష్యంగా ఆయన చేసిన కృషితో విశాఖ గ్లోబల్ హబ్‌గా మారుతుందన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనలు, పారిశ్రామిక రంగం దిశగా యువత ప్రయత్నాలు సాగించాలని కోరారు. అందరూ కలిసి ఏపీతో పాటు దేశాన్ని కూడా వికసిత్ భారత్ దిశగా నడిపిద్దామని పిలుపునిచ్చారు.