పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఓజీ అత్యధిక లాభాలు అందించిన టెరిటరీ అంటే నార్త్ అమెరికానే. చాలా మందుగానే హక్కులు తీసుకోవడంతో తక్కువ రేటుకు యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిర సినిమాస్ సొంతమైంది. ఆ మొత్తం రూ.12 కోట్లు మాత్రమే అని వార్తలు వచ్చాయి. ఐతే రిలీజ్ ఆలస్యం కావడం వల్ల పడ్డ వడ్డీల భారం, పబ్లిసిటీ ఇతర ఖర్చుల వల్ల బ్రేక్ ఈవెన్ మార్కు 3 మిలియన్ల దగ్గర సెట్ అయింది. ఐతే ఓజీ ఏకంగా 6 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్‌కు పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టింది.
ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్ ఫుల్ హ్యాపీనే. కానీ ఆ సంస్థ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుక్కారణం.. ఓ థియేటర్ ఛైన్‌తో పంపిణీ వివాదం. యార్క్ సినిమాస్ అనే సంస్థ ఓజీ రిలీజ్ ముంగిట ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కలకలం రేపింది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థ గతంలో కలెక్షన్లు పెంచి చూపించాలని ఒత్తిడి చేసిందని..
అలాగే ఓజీ సినిమాను తమ స్క్రీన్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకుల భద్రతకు ప్రమాదమని.. ఇంకా ఏవేవో కామెంట్లు చేస్తూ ఓజీ సినిమాను కెనడాలోని తమ స్క్రీన్లలో రిలీజ్ చేయట్లేదని ప్రకటించింది. ఇది పవన్ అభిమానులకు ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పాత విషయాలను ప్రస్తావించి ఓజీ మీద బురదజల్లేలా ఆ నోట్ ఉండడం.. కెనడాలో సినిమాకు సరైన రిలీజ్ లేకుండా చేయడం, అనేక షోలు క్యాన్సిల్ కావడం వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఐతే ఆ సమయంలో ప్రత్యంగిర సినిమాస్.. యార్క్ సినిమాస్ నోట్ మీద తీవ్రంగా స్పందించింది.
తమ మీద చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని.. ఈ ఇష్యూను తేలిగ్గా వదలమని.. మీతో బిజినెస్ చేసేది లేదని పేర్కొంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ సంస్థకు అండగా నిలిచారు. ఓజీని భుజాల మీద మోశారు. కానీ ఆ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవుతున్న సమయానికి ప్రత్యంగిర సినిమాస్.. యార్క్ సినిమాస్‌తో రాజీకి వచ్చేసింది. ఇరు వర్గాలు అన్ని సమస్యలు సమసిపోయాయని పేర్కొంటూ.. తమ భాగస్వామ్యంలో తర్వాత రాబోయే సినిమాల గురించి వెల్లడించారు.
ఇది పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఓజీ సినిమా మీద అభాండాలు వేయడంతో పాటు రిలీజ్ ప్రణాళికలను దెబ్బ తీసి... ఆ సినిమా వసూళ్లు తగ్గడానికి కారణమైన సంస్థతో ఇప్పుడు ఎలా రాజీ చేసుకున్నారని ప్రత్యంగిర సినిమాస్ మీద మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ తర్వాతి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఈ డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వొద్దని మైత్రీ సంస్థకు అల్లిమేటం విధిస్తున్నారు.