నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దేపల్లి జనార్దన్ రావు తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. దీనిలో గతానికి భిన్నంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. వైసిపి మాజీమంత్రి సీనియర్ నాయకుడు జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాము నకిలీ మద్యం తయారీ ప్రారంభించమని ఆయన చెప్పారు. అంతేకాదు జోగి రమేష్ తమకు అన్ని విధాల సహకరించారని కూడా ఆయన వివరించటం సంచలనంగా మారింది.
తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం మరింత వివాదానికి మరింత రాజకీయ దుమారానికి కూడా దారితీసింది. తంబళ్లపల్లి నియోజకవర్గం అయితే ఎవరికి అనుమానం రాదని, ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా కాబట్టి ఆ నియోజకవర్గంలో చేస్తే ఒకవేళ రేపు బయట పడినప్పటికీ అది చంద్రబాబు ఖాతాలో వేయచ్చు అన్నది జోగి ఆలోచనగా అద్దేపల్లి చెప్పుకొచ్చారు.
నిజానికి ఇటువంటి పరిణామాలు విషయంలో ఇది ఎంతవరకు నిలబడుతుంది కోర్టులో ఎంతవరకు ఇది నిరూపణ జరుగుతుంది అనేది పక్కన పెడితే ప్రస్తుతం అయితే జోగు రమేష్ మాత్రం ఈ ఉచ్చులో కురుకుపోతున్నారు అన్నది వాస్తవం. అందుకే ఆయన వెంటనే లైడికెక్టర్ టెస్టుకు సిద్ధం అంటూ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ విషయాన్ని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తు ముందు ముందు జరిగితే జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
గతంలో అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ సహా ఆయన కుమారుడుపై కేసులు నమోదు అయ్యాయి. అవి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం జోగి రమేష్ కొడుకు బెయిల్ పై ఉన్నారు. ఇక చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసు విచారణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు నకిలీ మద్యం కేసు జోగికి మరింత సెగ పెంచుతుంది అన్నది వాస్తవం. చివరకు దీని నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.