అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా(DDD) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. AIA మరియు బాలీ 92.3 సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని ప్లెసెంటన్ లో ఉన్న అలమెడా కౌంటీ ఫెయిర్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ ఫ్లాగ్ షిప్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సాంస్కృతిక, ప్రత్యేకమైన, అతి పెద్ద గ్రాండ్ దివాళీ ఈవెంట్ నిర్వహణకు మద్దతుగా నిలిచాయి. 25వేల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం అతి పెద్ద ఈవెంట్ గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా, మనోహరంగా, దృశ్యపరంగా అద్భుతంగా ఉన్న ఈ ఈవెంట్ ఆహూతులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఉదయం నుండి రాత్రి వరకు భక్తి భావంతో ఉన్నారు. శాంతి మరియు శ్రేయస్సు కోరుతూ పవిత్రమైన మహా మంగళ ఆర్తితో ఈ ఈవెంట్ ప్రారంభమైంది. "దుర్గా మాత" రథయాత్ర అట్టహాసంగా జరిగింది. భక్తి, సంగీతం మరియు సాంస్కృతికతల మేళవింపుతో ఆ ప్రాంగణం భారతీయతను నింపేసింది. రామాయణం యొక్క ఆకర్షణీయమైన నాటకీకరణ అయిన రామ్ లీల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడిపేందుకు వేలాది కుటుంబాలు తరలివచ్చాయి. ఇలా వివిధ సమయాల్లో వస్తూ పోతూ ఉన్న ఎన్నారైలతో ఫెయిర్ గ్రౌండ్ రోజంతా జనంతో కిక్కిరిసింది. సమీపంలోని పార్కింగ్ లాట్ లు, రోడ్లు ఎన్నారైల సందడితో జనసంద్రమయ్యాయి. 40 అడుగుల ఎత్తైన రావణుడి నమూనా దహనం, టపాసులు కాల్చే వేడుకను చూసేందుకు వారంతా తండోపతండాలుగా తరలివచ్చారు. రంగురంగుల బాణాసంచా పేళుల్లతో ఆ ప్రాంతమంతా దీపావళి ధమాకా జరిగింది. కళ్లు మిరిమిట్లుగొలిపే బాణాసంచా పేలుళ్లను ఆహూతులంతా ఆస్వాదించారు.
500 మందికి పైగా ప్రదర్శకులు ఇండోర్ మరియు అవుట్‌డోర్ వేదికలను తమ ఆటపాటలతో, టాలెంట్ లతో అలరించారు. భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా శాస్త్రీయ, జానపద, బాలీవుడ్ మరియు ఫ్యూజన్ ప్రదర్శనలతో వారు ఆకట్టుకున్నారు. AIA ఐడల్ పాటల పోటీ, బాలీ తంబోలాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ గ్రౌండ్ లో రకరకాల వస్తువులు అమ్మేందుకు 135కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు, ఆహూతుల కోసం 20కిపైగా ఫుడ్ బూత్‌లు ఉన్నాయి.
నోరూరించే భారతీయ రుచికరమైన వంటకాలు, పండుగ స్వీట్లు, సాంప్రదాయ దుస్తులు, నగలు, హస్తకళలు, దీపావళి అలంకరణలు వంటి విభాగాలు అలరించాయి. ఆహూతులంతా తమ కుటుంబ సభ్యులతో గర్బా మరియు దాండియా నృత్యాలు చేశారు. వేలాది మంది ఎన్నారైలు రంగురంగుల లైట్ల మధ్య నృత్యం చేయడంతో ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణం ఏర్పడింది. ఐక్యత మరియు పండుగ స్ఫూర్తిని వారు ప్రతిబింబించారు.
2026లో ప్రారంభమయ్యే దీపావళిని రాష్ట్ర సెలవుదినంగా కాలిఫోర్నియా అధికారికంగా గుర్తించడంతో ఈ సంవత్సరం వేడుక చరిత్రాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది భారతీయ అమెరికన్ సమాజానికి ఒక మైలురాయి వంటి నిర్ణయం. కాలిఫోర్నియాలో భారతీయ డయాస్పోరా యొక్క పెరుగుతున్న సాంస్కృతిక మరియు పౌర ప్రభావాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ అధికారులు మరియు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులు:
గౌరవనీయులు రాబ్ బొంటా, కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్
గౌరవనీయులు డాక్టర్ శ్రీకర్ రెడ్డి, భారత కాన్సుల్ జనరల్, శాన్ ఫ్రాన్సిస్కో
గౌరవనీయులు రాకేష్ అద్లాఖా, డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో
గౌరవనీయులు డేవిడ్ హౌబెర్ట్, అల్మెడ కౌంటీ సూపర్‌వైజర్
గౌరవనీయులు జాక్ బాల్చ్, ప్లెసాంటన్ మేయర్
గౌరవనీయులు రాజ్ సాల్వాన్, ఫ్రీమాంట్ మేయర్
గౌరవనీయులు షెర్రీ హు, డబ్లిన్ మేయర్
గౌరవనీయులు మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, శాన్ రామన్ మేయర్
గౌరవనీయులు కార్మెన్ మోంటానో, మిల్పిటాస్ మేయర్
గౌరవనీయులు శ్రీధర్ వెరోస్, శాన్ రామన్ వైస్ మేయర్
గౌరవనీయులు జీన్ జోసీ, కౌన్సిల్ సభ్యుడు, డబ్లిన్
గౌరవనీయులు ఇవాన్ బ్రానింగ్, కౌన్సిల్ సభ్యుడు, లివర్మోర్
గౌరవనీయులు రిను నాయర్, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్
అజయ్ భూటోరియా, ఇండో-అమెరికన్ రాజకీయ నాయకుడు
లెఫ్టినెంట్ మైఖేల్ బకౌట్, అల్మెడ కౌంటీ యొక్క షెరీఫ్ కార్యాలయం
కెప్టెన్ కర్ట్ ష్లెహుబెర్, ప్లెసాంటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్
ఈ ఈవెంట్ స్పాన్సర్లందరికీ AIA బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అలమెడా కౌంటీ సూపర్ వైజర్ డేవిడ్ హౌబర్ట్, సంజీవ్ గుప్తా CPA (బాణాసంచా), డాక్టర్ ప్రకాష్ & రోహిత్ అద్వానీ (రావణ్ దహన్), రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెల్ పాడ్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, ఇతర స్పాన్సర్లలో హెల్పర్ జెనీ, ఎర్త్ క్లీన్స్, వాచి సిల్క్స్, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, మై పర్సు, ICICI బ్యాంక్, కీస్టోన్ ఉత్సవ్, తనిష్క్ జ్యువెలర్స్, దీక్షా, శ్రీశివ సాయి కిరాణా & కోరల్ అకాడమీ లకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ భారీ ఈవెంట్ విజయవంతం కావడం కోసం అంకితభావంతో పనిచేసిన ప్రదర్శకులు, విక్రేతలు మరియు 150 మందికి పైగా వాలంటీర్లకు AIA హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. బాణసంచా ధమాకాతో బే ఏరియా ఆకాశంలో టపాసుల ఇంద్రధనస్సు సందడి చేసింది. ఈ దసరా దీపావళి ధమాకా- 2025 కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, ఐక్యతలకు ప్రతీక. భారతీయ అమెరికన్ సమాజంలో పెరుగుతున్న సాంస్కృతికతకు ప్రతిబింబం. మునుపెన్నడూ లేని విధంగా కాలిఫోర్నియాలో సాంస్కృతిక వెలుగులు నింపిన వేడుక ఇది.