వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన.. తాజాగా టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అరాచకాలు.. జగన్ మానసిక ప్రవృత్తి వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. తామే నేరాలు చేసి వాటిని తెలుగుదేశంపై మోపడం వైసీపీకి అలవాటని దుయ్యబట్టారు. జగన్ అండ్ కో క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నేతలకు సూచించారు.
సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య జరిగితే.. ఆ కేసును కూడా టీడీపీపై నెట్టే ప్రయత్నం చేసిన వారిని మనం ఉదాసీనంగా వ్యవహరించాం. అందుకే గత ఐదేళ్లలో పార్టీ దెబ్బతింది. ఆ పరిస్థితి మరోసారి రాకుండా ఉండాలంటే.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కదా.. మనకు ఏమీ కాదని అనుకోవద్దు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యవహారం కూడా జగన్ అండ్ కో ప్రణాళిక ప్రకారమే జరుగుతోందన్నారు.
“మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు జగన్ ఆయన బ్యాచ్‌కు సరిపోతాయి” అని చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నేరాల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ నేరాలకు పెట్టింది పేరన్న చంద్రబాబు .. ఈ విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎవరూ ఉదాసీనంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది తాను చేస్తానని.. మీరు ప్రజల్లోకి వెళ్లాలని ఎంపీలకు సూచించారు.
టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జగన్ అండ్ కో క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. “జగన్ అండ్ కో చేసిన నేరాలను మన నేతల మీదకు నెట్టే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ఇప్పుడే ఖండించాలి. లేకపోతే.. వారు మంచి వారుగా.. మన నేరస్తులుగా ప్రజలను నమ్మిస్తారు.`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు.