ఏపీ ప్రభుత్వం తాజాగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ సహా దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో చరిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో హైదరాబాద్ కేంద్రంగా మైక్రోసాప్ట్‌ను తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ ను తీసుకువచ్చామని వివరించారు. ఏదైనా.. తాను దూరదృష్టితోనే చేస్తున్నట్టు వివరించారు. గూగుల్ డేటా సెంటర్‌తో ఏపీ ముఖ చిత్రం మారుతుందన్నారు.
`భారత్ ఏఐ శక్తి` పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. టెక్నాలజీలో ముందుం టేనే నేటి యువత జీవితాలు బాగుంటాయని తెలిపారు. ఈ విషయంలో ఏపీ అందరికన్నా ముందుం
టుందని చెప్పారు. అందుకే.. విశాఖ కేంద్రంగా గుగూల్‌ను తీసుకువచ్చామన్నారు. తొలినాళ్లలో అనేక ఇబ్బందులు పడ్డామని.. ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని.. అన్నారు. అయినా కూడా గూగుల్‌ను ఒప్పించి విశాఖకు రప్పించినట్టు చెప్పారు.
ఈ విషయంలో కేంద్రం కూడా సహకరించిందన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కనెక్షన్ల రంగాల్లో ఏపీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా అవతరించనుందన్న చంద్రబాబు.. భవిష్య త్తును తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఐటీని పరిచయం చేస్తే.. అందరూ నవ్వుకున్నారని, కానీ.. ఇప్పుడు ఆ రాష్ట్రానికి అదే ఆధారంగా మారిందన్నారు. అలానే విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా కేంద్రం భవిష్యత్తులో ఏపీకి బంగారు కలశంగా మారుతుందన్నారు.
``హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం. ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషదాయకం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్న ఆయన.. విశాఖ పట్నంతో పాటు.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కూడా.. మరింత పేరు వస్తుందని.. తద్వారా పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ విషయంలో సహకరించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.