తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ క్రమంలో హైకోర్టు దీనిపై స్టే విధించడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరింది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపిన కోర్టు.. తాజాగా గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము జోక్యం చేసుకునేది లేదని తెలిపింది. హైకోర్టు స్టేను ఎత్తేసేది కూడా లేదని స్పష్టం చేసింది. పాత విధానంలో రిజర్వేషన్‌ను అమలు చేసుకోవచ్చన్న హైకోర్టు వాదనలతో ఏకీ భవిస్తున్నట్టు తెలిపింది. ఆమేరకు ఎందుకు నిర్ణయం తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంది. అదేసమయంలో మెరిట్స్ ప్రకారం.. కోర్టు వాదనలు విని.. సాధ్యమైనంత త్వరగా తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఇక, హైకోర్టు ఇప్పటికే.. ఈ కేసులో పాత విధానంలో రిజర్వేషన్ అమలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇదేసమయంలో ఎన్నికల ప్రక్రియపైనా స్టే విధించింది. 42 శాతం రిజర్వేషన్‌పై తీసుకువచ్చిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్నప్పుడు.. మధ్యంతరంగా జీవో ఎలా తీసుకువస్తారని ప్రశ్నించింది. దీనిని అంగీకరించలేమని కూడా పేర్కొంది. దీంతో హైకోర్టుతీర్పుపై రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇదిలావుంటే.. అసలు 42 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ.. రెడ్డి సామాజిక వర్గం నేత మాధ వరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపైనా సర్కారుకు పెద్దగా ఊరట లభించ లేదు. ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చిచెప్పింది. ఈ మొత్తం పరిణామాలతో సర్కారుకు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏ విధంగా ముందుకు సాగుతుందనేది చూడాలి. ఈ నెల 18న బీసీ సంఘాలు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.