ఏపీలో విజనరీ లీడర్ షిప్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పరోక్షంగా ఆయన సీఎం చంద్ర బాబుపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ-అమరావతి కాంబినేషన్‌లో అభివృద్ధి సాగుతోందన్నారు. రాష్ట్రం లో డబుల్ ఇంజన్ సర్కారు కేవలం 16 మాసాల కిందటే ప్రయాణం ప్రారంభించిందన్న మోడీ.. దూసుకు పోవడంలో మాత్రం అంతకుమించి అన్నట్టుగా ఉందన్నారు. కర్నూలులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు దూసుకుపోతోందన్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల రూపంలో రాష్ట్రానికి గొప్ప నాయకులు లభించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఊహించని విధంగా అభివృద్ధి ముందుకు సాగుతోందన్నారు. తొలుత ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం.. హిందీలో కొనసాగించారు. దీనిని శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి అనువదించారు.
రాష్ట్రానికి రెండు రోజుల కిందటే గూగుల్ సంస్థ పెట్టుబడితో వచ్చిందన్న ప్రధాని.. ఇది ప్రపంచ దేశాలను రాష్ట్రం ఆకర్షించేలా చేస్తుందన్నారు. గూగుల్ సీఈవోతో తాను స్వయంగా మాట్లాడినప్పుడు.. అమెరికా వెలుపల తమ పెట్టుబడులు చాలానే ఉన్నాయని.. అయితే.. ఏపీలో పెట్టిన పెట్టుబడి అతి పెద్దదని వివరించారు. ఇది ఆసియాలోనే అతి భారీ పెట్టుబడిగా పేర్కొన్నారని తెలిపారు. దీనికి డబుల్ ఇంజన్ సర్కారు ఉండడమే నిదర్శమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్న ప్రధాని.. ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.
ఏపీకి కేంద్రం మద్దతు ఉంటుందని ప్రధాని తెలిపారు. ఆత్మగౌరవం, సంస్కృతికి ఏపీ ప్రతిబింబమని ప్రధాని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అభివృద్ది, కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇస్తున్నామ న్నారు. ఈ క్రమంలో రహదారులు, ప్రాజెక్టులు, రైల్వేలు వస్తున్నాయన్నారు. తాజాగా నిర్మించిన.. సబ్బవరం ప్రాజెక్టు దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. రైల్వే ఫ్లైఓవర్లకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పారిశ్రామికంగా.. ప్రాధాన్యం ఇస్తున్నారు. `స్వర్ణాంధ్ర` సాకారానికి మేం ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రంలో అభివృద్ధిని సంపూర్ణంగా సాధిస్తుందని చెప్పారు.