మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ని గుడ్డు శాఖా మంత్రి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఐటీ శాఖా మంత్రిగా ఉన్న గుడివాడ అమర్ నాథ్ గుడ్ల గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇటీవల విశాఖలో భారీ పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు తమ హయాంలోనే వచ్చిందని అమర్ నాథ్ అన్నారు. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఉద్దేశించి అమర్ నాథ్ విమర్శలు చేశారు.
దీంతో, ఆ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. "పదే పదే జగన్ పెట్టిన గుడ్డే అంటే గుడ్డు పగిలిపోతుంది" అంటూ అమర్‌నాథ్‌కు గోరంట్ల కౌంటర్ ఇచ్చారు. అమర్ నాథ్ కు, జగన్‌కు సబ్జెక్ట్ తెలియదని, అసలు విషయం తెలియకుండా ఆవేశపడొద్దని, గుడ్డే ముద్దు అని హితవు పలికారు. అంతకుముందు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై కూడా అమర్ నాథ్ విమర్శలు చేశారు. 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అమర్‌నాథ్ తప్పుపట్టారు. ఆ విషయాన్ని గూగుల్ సంస్థతోనే చెప్పించాలని, అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తామే ప్రభుత్వానికి సన్మానం చేస్తామన్నారు.