పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశించి మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కామెంట్లపై నారాయన క్లారిటీనిచ్చారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని, పిఠాపురంలో సమస్యలు జీరో చేశామని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై వర్మ కూడా స్పందించారు.
విశాఖ మంత్రి నారాయణతో వర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇదంతా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రేనని వర్మ అన్నారు. సీఎం చంద్రబాబు తనకు సర్వస్వమని, ఆయన ఆగమంటే ఆగుతాను, దూకమంటే దూకుతాను’అని వర్మ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీకి తాను ఒక పిల్లర్ లాంటి వాడినని వర్మ చెప్పారు.
ఈ వివాదం వెనుక ‘పేటీఎం బ్యాచ్’ ఉందని, వారు చేసే అసత్య ప్రచారాలను తాను అస్సలు పట్టించుకోనని అన్నారు. కాకినాడ జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య మంత్రి నారాయణ ఒక వారధిలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా కాదని తేల్చి చెప్పారు. ఇకనైనా ఈ పేటీఎం బ్యాచ్ ఈ తరమా విష ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.