శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. మొదటి అంతస్థులో ఉన్న ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మెట్ల రెయిలింగ్ కూలడంతో 9 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. మృతులలో ఎక్కువ మంది మహిళలున్నారు. చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మామూలుగా అయితే, ఈ ఆలయానికి రోజుకు 2-3 వేల మంది భక్తులు మాత్రమే వస్తుంటారు. అయితే, కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దాదాపు 15 వేల మంది భక్తులు రావడంతో నిర్వాహకులు చేతులెత్తేశారని తెలుస్తోంది. ఈ ఘటనఫై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మరణించడం చాలా విషాదకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.