ఏపీలో మరో ఘోరం సంభవించింది. ఓ ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన ఆలయంలో జరిగిన తొక్కిసలాట లో 9 మంది భక్తులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత భక్తుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనను ఎంతో కలచి వేసిందన్న చంద్రబాబు.. దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాలని.. మంత్రిని కోరారు.
ఏం జరిగింది?
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కార్తీక తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. సమీపంలో మరో శ్రీవారి ఆలయం లేకపోవడం.. అధునాతన వసతులతో.. ఆకట్టుకునే హంగులతో దీనిని నిర్మించడంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయం నమూనాగా.. ప్రచారం చేస్తారు. దీంతో ప్రతి శనివారం భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు. కార్తీక సోమవారం కావడంతో నవంబరు 1 శనివారం.. మరింత మంది భక్తులు వచ్చారు.
క్యూలైన్లు ముందుకు కదలకపోవడంతో.. భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లాలన్న తొందరలో తోపులాట చోటు చేసుకుంది. ఇది చివరకు తొక్కిసలాటకు దారి.. తొలుత ఇద్దరు.. తర్వాత 9 మంది(ప్రాథమిక సమాచారం) మృతి చెందారు. పదుల సంఖ్యలో మహిళలకు, చిన్నారులు స్పృహ కోల్పోయారు. కాగా.. ఇది ప్రభుత్వ ఎండోమెంట్ పరిధిలోని ఆలయం కాదని.. అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి.. తన సొంత 12 ఎకరాల పొలంలో నిర్మించుకున్నారని.. ఈ ఏడాది మేలోనే ఇది ప్రారంభమైందని తెలిపారు.
ప్రచారమే ముంచిందా?
కార్తీక సోమవారం కావడంతో ఆలయ నిర్వాహకుడు.. హరిముకుంద్ పండా(ఒడిశాకు చెందిన పారిశ్రామిక వేత్త గా ప్రచారం జరుగుతోంది) పెద్ద ఎత్తున ఆలయాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలా అయితే కైంకర్యాలు జరుగుతాయో అలానే ఏకాదశి సందర్భంగా ఇక్కడ కూడా నిర్వహిస్తారని ప్రచారం చేయడంతో భక్తులు పోటెత్తారు. కానీ, వారికి తగిన విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయలేదు. భక్తుల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.