``నితీష్‌కుమార్ ఏదో అనుకుంటున్నారు. చివరకు ఆయనకు ఏదీ మిగలదు. ఇప్పుడున్న సీఎం సీటు కూడా మిగులుతుందని ఎవరైనా అనుకుంటే.. అది వారి ఖర్మ. బీజేపీ లాగేసుకుంటుంది.``- ఇదీ బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్ పార్టీల నాయకులు ఇంటింటికీ చేస్తున్న ప్రచారం. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే వంటివారు కూడా.. ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు.
దీనికి కారణం.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇటీవల చేసిన వ్యాఖ్యలే. బీజేపీ నాయకుడు, భవిష్యత్తులో ఎన్డీయే విజయం దక్కించుకుంటే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవుతారని ప్రకటించిన.. సామ్రాట్ అనే ఆర్ ఎస్ ఎస్ నాయకుడికి అంతకుమించిన పదవిని ప్రధాని కట్టబెడతారంటూ.. అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు.. విపక్ష కూటమికి అస్త్రంగా మారాయి. దీంతో ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్‌ను పక్కన పెట్టడం ఖాయమని.. ఆయనను చూసి బీజేపీ కూటమిని గెలిపించ వద్దని ప్రత్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ వ్యవహారంపై సీఎం, జేడీయూ అధినేత నితీష్‌కుమార్ స్పందించారు. అయితే.. ఆయన బహిరంగ సభలో కాకుండా.. వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలా.. సీఎం నితీష్ వీడియో సందేశం విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
``కొందరు నాకేదీ మిగలదని వ్యాఖ్యానిస్తున్నారు. మంచిదే.. ముఖ్యమంత్రిగా నేను ఏమీ దాచుకోలేదు. ఏమీ దోచుకోలేదు. నాకు కుటుంబం ఉన్నా.. లేనట్టే ఉన్నాను. కుటుంబం కోసం ఏనాడూ ఆలోచించలేదు. బీహారీల అభ్యున్నతి, వారి ఆత్మగౌరవానికి పాటు పడ్డాను. అందుకే నాకు ఏమీ మిగల్లేదు. మిగుల్చుకోవాలని కూడా అనుకోవడం లేదు.`` అంటూ.. ఆయన కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా మలుపు తిప్పే ప్రయత్నం చేశారు.
అంటే.. కాంగ్రెస్ నేతలు సీఎం పదవి గురించి వ్యతిరేక ప్రచారం చేస్తుంటే.. నితీష్ మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ సహా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిని నిర్మగర్భంగా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా.. నితీష్ చేసిన వీడియో సందేశం ప్రస్తుతం బీహార్‌లో రాజకీయ చర్చను మలుపుతిప్పింది.