అనుకున్నట్లే జరిగింది. అంచనాలు తప్పలేదు. ఆదివారం తెల్లవారుజామున మొదలైన నాటకీయ పరిణామాలు.. ఉద్రిక్త పరిస్థితుల నడుమ మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో ఆయన పాత్ర ఉందంటూ గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అందుకు కౌంటర్ గా తనకు ఏ పాపం తెలీదంటూ జోగి రమేష్ దుర్గమ్మ దేవాలయంలో కర్పూరంతో ప్రమాణాలు చేయటం తెలిసిందే. అంతేకాదు.. తాను లైడిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధమంటూ ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని పోలీసులు స్పష్టం చేయటంతో పాటు.. ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చటంతో ఆయన అరెస్టు ఖాయమన్న మాట బలంగా వినిపించింది. అందుకుతగ్గట్లే.. తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ఇచ్చిన వాంగ్మూలంతో జోగి రమేష్ మెడకు కేసు ఉచ్చు బిగుసుకున్నట్లైంది. తనకు జనార్ధన్ రావు ఎవరో తెలీదని జోగి రమేష్ చెప్పగా.. ఆయనతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా ఇటీవల జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో తనకు సంబంధం లేదని దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశానని.. తాను తప్పు చేసినట్లుగా చంద్రబాబు.. లోకేశ్ ప్రమాణం చేయాలని సవాలు విసరటం తెలిసిందే. సీబీఐతో కాకుంటే ఏ సంస్థతో అయినా విచారణ జరపాలని.. ఎవరో స్టేట్ మెంట్ ఇచ్చారు కాబట్టి తనను అరెస్టు చేయటమేమిటంటూ ఆయన ప్రశ్నించటం తెలిసిందే. తనను జైలుకు పంపితే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న జోగి రమేష్.. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొనటం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ను నకిలీ లిక్కర్ కేసులో ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టకూడదన్న మాట తెలుగు తమ్ముళ్లలో బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో.. తన అరెస్టు ఖాయమన్న విషయాన్ని జోగి రమేష్ గుర్తించి.. మానసికంగా సిద్ధమైనట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేసిన పోలీసులు.. నకిలీ మద్యం ఫ్యాక్టరీని పెట్టిన టీడీపీ ఇన్ ఛార్జ్ జయచంద్రారెడ్డిని.. ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. జనార్ధనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేదని.. అరెస్టు తర్వాత జైలుకు వెళ్లిన తర్వాతే.. జనార్దన్ రావు వీడియో వీడియో విడుదల కావటం.. అందులో జోగి ప్రస్తావన వచ్చినట్లుగా వైసీపీ వర్గీయులు గుర్తు చేసతున్నారు. జనార్దన్ రావుతో సత్ సంబంధాలు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణప్రసాద్.. ఆయన బావమరిదిని మాత్రం పోలీసులు విచారించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.