మొంథా తుఫాన్ ముప్పు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం యాక్టివ్గా వ్యవహరించింది. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతి జిల్లాకు రూ.1 కోటి చొప్పున నిధులు కేటాయించడం ద్వారా సహాయ చర్యలు వేగవంతం చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
వైసీపీ పాత్ర కనిపించలేదు..
ఇక ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే.. తుఫాన్ సమయంలో ఆ పార్టీ స్పందన చాలా తక్కువగా ఉండిందని విమర్శలు వినిపించాయి. జిల్లాల వారీగా ఆ పార్టీ శ్రేణులు కొన్ని చోట్ల మాత్రమే సహాయక చర్యల్లో పాల్గొన్నా, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే స్థాయిలో వైసీపీ యాక్టివిటీ కనిపించలేదు. తుఫాన్ సమయంలో వైసీపీ ప్రధాన నేతలు గ్రౌండ్ లెవల్లోకి రాకపోవడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు ఆ తుఫాన్ దాటిపోయిన వారం రోజుల తరువాత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 4వ తేదీ (మంగళవారం) ఆయన కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి పంట నష్టం జరిగిన రైతులను కలుసుకోనున్నారు. ఈ పర్యటన తుఫాన్ బాధితులకు సంఘీభావం తెలిపే ఉద్దేశ్యంతోనే అని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ఈ పర్యటన వెనుక వేరే ఉద్దేశ్యముందని అంటోంది.
తుఫాన్ దాటిపోయి, ప్రభుత్వం సహాయం కూడా అందించిన తరువాత, ఇప్పుడు మాత్రమే జగన్ బాధితులను కలవాలనుకోవడం పై అధికారపక్ష నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. జగన్ కు ఇప్పుడే తెల్లారిందా..? అంటూ సెటైర్స్ పేలుస్తున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ పర్యటన తుఫాన్ బాధితుల కోసం కాదని, రాజకీయ డ్యామేజ్ కంట్రోల్ కోసం అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.