ఏపీ సీఎం చంద్రబాబు.. సతీసమేతంగా లండన్‌కు చేరుకున్నారు. ఇక్కడ నిర్వహించే నాలుగు కీలక కార్యక్రమాల్లో సీఎం చంద్ర బాబు పాల్గొంటారు. అదేవిదంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల అనంతరం.. సీఎం చంద్రబాబు ఏపీకి తిరిగి రానున్నారు.
పాల్గొనే కార్యక్రమాలు ఇవే..
1) ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ భువనేశ్వరిని.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్... ఐఓడీ సంస్థ 2025 సంవత్స రానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న(మంగళవారం) దీనిని ప్రదానం చేయనున్నారు.
2) హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్(బంగారు నెమలి) అవార్డుకు కూడా భువనేశ్వరి ఎంపికయ్యారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ భువనేశ్వరితో పాటు సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
3) పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు సమావేశ మవుతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తారు. ముఖ్యంగా విశాఖ ఐటీ రాజధానిగా ఎదుగుతున్న క్రమంలో ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను కూడా వివరించి.. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తారు.
4) సీఐఐ నిర్వహించే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. ఇది కూడా పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం. అదేవిధంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న పారిశ్రామిక సదస్సులో పాల్గొనాలని వారిని ఆహ్వానించనున్నారు.
ఘన స్వాగతం..
లండన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరిలకు ఊహించని విధంగా స్వాగతం లభించింది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన తెలుగు వారు ఘన స్వాగతం పలికారు. గజ మాలలతో దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా తెలుగు వారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. తెలుగు వారు ఎక్కడున్నా.. సంప్రదాయాలు, సంస్కృతులకు పెద్దపీట వేయాలని ఆయన పిలుపునిచ్చారు.