ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. వాస్తవానికి ఇది వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ...చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.
లండన్ లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థ అయిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ను ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించారు. అమరావతి, విశాఖ నగరాల్లో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.