ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య పలు నియోజకవర్గాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్నూలు, అనం తపురం, విజయనగరం సహా.. పలు నియోజకవర్గాల్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇవి క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్ర స్థాయిలోనూ ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్‌కు కూడా ఇలాంటి విషయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక నాయకత్వం జోక్యం చేసు కుని పరిశీలించి.. పరిష్కరించాలని బాబు చెబుతున్నారు.
కానీ, ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ కూడా ముందుకు సాగడం లేదు. దీంతో వివాదాలు అల్లుకుంటూనే ఉంటున్నాయి. తాజాగా దీనికి పరిష్కారం చూపుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు.. సుదీర్ఘ సమయంలో నాయకులకు వెచ్చించారు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన తీవ్ర సమస్యలు, వివాదాలు, ఆరోపణల నుంచికొన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నేతల మధ్య వివాదాలను కూడా ఆయన ప్రస్తావించారు. వీటిపై తాను పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. పార్టీలైన్‌కు భిన్నంగా వ్యవహరించే వారిని కూడా ఉపేక్షించేది లేదన్నారు.
అయితే.. ఇవన్నీ సాధారణంగా చేసే హెచ్చరికలే. కానీ, ఈ విషయంలోనే చంద్రబాబు మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తు తం చేస్తున్న అభివృద్ధి పనులు.. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పింఛన్ల పంపిణీ, సూపర్ సిక్స్ సహా.. పలు కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంపై నివేదిక కోరారు. వచ్చే 15 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని సీఎం సూచించారు. వీటి ఆధారంగా ఇప్పటి వరకు నాయకుల పనితీరును అంచనా వేసేందుకు కమిటీని నియమిస్తామన్నారు. దాని ప్రకారం.. నాయకులకు మార్కులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రతి విషయాన్నీ సీరియస్‌గానే తీసుకుంటానన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు.. ఎంపీలకు పెద్దచిక్కు వచ్చిందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు వివాదాల చుట్టూ తిరిగిన కొందరు నేతలు.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని... అభివృద్ధికి సంబంధించిన నివేదికలు ఇవ్వడంలో వారు విఫల మైతే.. చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. నొప్పి తగలకుండా.. చంద్రబాబు ఎవరినీ కించపరచకుండా.. ఎమ్మెల్యేలు.. ఎంపీల తగువును అభివృధ్ధికి మెలిక పెట్టి పరిష్కరించే ప్రయత్నం చేయడం గమనార్హం. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.