దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఒక కాలాన్ని మార్చేసిన సినిమా. భారత సినిమా హద్దులను దాటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా రీ-రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి థియేటర్లలో బాహుబలి మ్యాజిక్ పునరావృతమవుతుందని భారీ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు.
రీ-రిలీజ్ అనగానే సోషల్ మీడియాలో హడావిడి మామూలుగా లేదు. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్‌లో ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. ఆ హైప్‌నే ఆధారంగా చేసుకుని రూ. 100 నుంచి 150 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అయితే రీ-రిలీజ్ మొదటి రోజు థియేటర్లలో హడావిడి కనిపించింది. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ఆ హంగామా ఎక్కువ కాలం నిలవలేదు. రెండో రోజు నుంచే వసూళ్లు స్లో అయ్యాయి.
సినీ ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటివరకు రూ. 50 కోట్లు కూడా దాటలేదట. బాహుబలి రీ-రిలీజ్ ఫలితాన్ని చూసి మేకర్స్ తో పాటు సినీ వర్గాలు కొంచెం షాక్ అయ్యాయి. అయితే రీ రిలీజ్‌లో బాహుబలికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. బాహుబలి సినిమాను ప్రేక్షకులు ఇప్పటికే పలు సార్లు ఓటీటీల్లో, టీవీలో చూసేశారు. అలాగే రీ-రిలీజ్‌లో కొత్త కంటెంట్ లేకపోవడం వల్ల థియేటర్‌కి వెళ్లే ఆసక్తి తగ్గింది. దీనికి తోడు రీ-రిలీజ్‌కి టికెట్ ధరలు కూడా కొంచెం ఎక్కువగా ఉండటం వసూళ్లపై ప్రభావం చూపిందని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.