అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన విషాదం ఇప్పటికి పచ్చిపచ్చిగానే ఉంది. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ రోజు ప్రమాదం జరిగిన విమానంలో 11ఏ సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేశ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడటం తెలిసిందే. విమాన ప్రమాద వేళ విసురుగా అతడు కూర్చున్న సీటు ఊడిపోయి.. బయటకు విసిరేసినట్లుగా బయట పడటం.. అతడు సీటు బెల్టు పెట్టుకోవటంతో.. కొద్దిపాటి గాయాల బారిన పడిన అతను.. తనకుతానుగా నడుచుకుంటూ అంబులెన్సు వద్దకు చేరుకోవటం.. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ చూసే ఉంటాం.
ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బ్రిటన్ కు వెళ్లిపోయాడు. విమాన ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్న వేళ.. అతడు ఎలా ఉన్నాడు? లక్కీమ్యాన్ గా అందరి నోట పిలిపించుకున్న అతడి జీవితం ఇప్పుడు ఎలా ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. వాస్తవం ఇంత చేదుగా ఉంటుందా?అనుకోకుండా ఉండలేం. అందరూ అతడ్ని లక్కీమ్యాన్ అంటుంటే.. అతడి జీవితం మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే దీనికి నిదర్శనం.
తాజాగా బ్రిటన్ లోని స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన మాటల్ని చదివితే.. షాక్ కు గురి కాకుండా ఉండలేరు. ఎందుకంటే అంతటి విషాదంలో అతను ఉండటమే దీనికి కారణం. బ్రిటన్ లో ఉండే అతను గుజరాత్ లో ఉన్న తన ఫ్యామిలీని కలిసేందుకు సోదరుడితో వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాద ఉదంతంచోటు చేసుకుంది. అతడి సీటుకు వెనుక వరుసల్లో ఉన్న అతని సోదరుడు అజయ్ (27)ఈ ప్రమాదంలో మరణించటం తెలిసిందే.
అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న తనను చాలామంది లక్కీమ్యాన్ అంటుంటారని.. కానీ ఆ ప్రమాదం తర్వాత తన జీవితమే మారిపోయిందని పేర్కొన్నారు. తనకు అన్నీ వేళలా అండగా ఉన్న తన తమ్ముడ్ని కోల్పోవటం చాలా బాధగా ఉందని.. ప్రమాదం తర్వాత తమ కుటుంబ పరిస్థతి పూర్తిగా మారిపోయినట్లు పేర్కొన్నారు. ‘‘పరిస్థితులు పూర్తిగా తల కిందులు అయ్యాయి. ప్రమాదఘటనను తలుచుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్ర కూడా పట్టటం లేదు. గదిలో కూర్చొని తాను.. అవతల తన తల్లి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాం’’ అని తన పరిస్థితిని చెప్పుకొచ్చాడు.
ఇప్పటికీ తన కాలు.. భుజం.. మోకాలు.. వెన్ను కు నొప్పులు వెంటాడుతూనే ఉన్నాయని.. మునుపటిలా నడవడం.. డ్రైవింగ్ చేయడం సాధ్యం కావటం కావట్లేదన్నాడు. ‘‘ప్రమాదం తర్వాత భారత్ లోని మా బిజినెస్ మూతపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. ప్రమాద ఘటనలో నేనొక్కడినే ఎలాబయటపడిందీ ఇప్పటికి అర్థం కావట్లేదు ’’ అంటూ తన ఇబ్బందుల్ని ఏకరువు పెట్టాడు.