ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే రోజా.. ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేస్తున్నారా? న్యూ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారా? పాలిటిక్స్ కు దూరం కావాలని డిసైడ్ అయ్యారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ విపక్షాలపై విరుచుకుపడిన రోజా.. ఇప్పుడు తాడేపల్లి వైపు కన్నెత్తి చూడట్లేదు.
ఒకప్పుడు సీఎం జగన్‌కు అత్యంత నమ్మకమైన నేతగా ఉన్న రోజా, ఇప్పుడు ఆయన సమీక్ష సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. పార్టీ ప్రధాన కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే రికార్డింగ్ వీడియోల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇలా క్రమంగా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గడం చూసి, ఆమె భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
రోజా రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ వివాదాలతో నిండింది. సొంత పార్టీ నేతలతో సైతం ఆమెకు విభేదాలు తలెత్తాయి. “రోజా లాంటి నేతలతో మాకు పని కష్టమే” అని కొందరు సీనియర్ లీడర్లు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాతే వైసీపీ అధికార ప్రతినిధిగా శ్యామల ఎంపిక కావడం యాదృచ్ఛికం కాదని కొందరు అంటున్నారు. పార్టీ నుండి ఆమెను నేరుగా పంపలేకపోయినా, వ్యూహాత్మకంగా పక్కకు పెట్టినట్లు వైసీపీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీ లోపలి అసంతృప్తులు, అంతర్గత పోటీలు, గ్రూప్ రాజకీయం, కూటమి దూకుడు.. ఇవన్నీ రోజాను రాజకీయాలకు దూరం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే రోజా ఇప్పుడు మళ్లీ సినీ రంగంపైనే దృష్టి సారించినట్లు సమాచారం. తాజాగా ఆమె తమిళనాడులో ‘లెనిన్ పాండియన్’ అనే చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో వృద్ధురాలిగా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు.