తమిళ సినిమాకు రెండు కళ్లు అనదగ్గ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.. నాలుగు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనే విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ సహా ముందు కొన్ని పేర్లు వినిపించాయి. చివరికి జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.
కానీ దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈలోపు కమల్ నిర్మాణంలో రజినీ హీరోగా ఓ సినిమా అనౌన్స్ కావడం విశేషం. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్స్ ఫిలిమ్స్‌తో కలిసి కమల్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతుండడం విశేషం.
సుందర్.సి ఒకప్పుడు రజినీకి అరుణాచలం లాంటి పెద్ద హిట్ ఇచ్చాడు. కమల్‌తో సత్యమే శివం లాంటి క్లాసిక్ తీశాడు. కానీ గత కొన్నేళ్లలో ఆయన ఏమంత గొప్ప ఫామ్‌లో లేడు. హార్రర్ కామెడీ ఆరణ్మయి సిరీస్‌లతోనే చాలా ఏళ్లు గడిపేశాడు. ఈ సిరీస్‌లో నాలుగు సినిమాలు తీశాడు సుందర్. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో మూకుత్తి అమ్మన్-2 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక కొత్త ఏడాదిలో రజినీ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.
ప్రస్తుతం సూపర్ స్టార్.. జైలర్-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజినీ-సుందర్ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. 2027 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతుందట. సుందర్ దర్శకత్వ శైలి ప్రకారం ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనరే అయ్యుంటుంది. మరి ఔట్ డేటెడ్ ముద్ర వేయించుకున్న దర్శకుడు.. రజినీకి ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలి. ఇప్పుడీ ప్రాజెక్టును అనౌన్స్ చేయడం చూస్తే.. రజినీ, కమల్ కలిసి నటించే సినిమా మొదలవడానికి టైం పట్టేలా ఉంది. అసలా సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.