ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి తన వింత చర్యతో వార్తల్లో నిలిచారు. అక్రమాస్తుల కేసులో కోర్టు హాజరు తప్పనిసరి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా జగన్ మాత్రం `నేను రాను.. రాలేను` అంటూ షాకిచ్చారు. అక్రమ ఆస్తుల కేసులో 2012లో సీబీఐ జగన్‌ను అరెస్ట్ చేసింది. దాదాపు 16 నెలల జైలు జీవితం తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుండి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక పాలన బాధ్యతలను చూపిస్తూ మినహాయింపు పొందారు.
ఇప్పుడు పరిస్థితి మారింది. కోర్టు ఇటీవలే ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని షరతు విధించింది. ఈ షరతును లైట్ తీసుకున్న జగన్.. `నేను కోర్టుకు రావాలంటే ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం.. అందుకే కోర్టుకు రాలేను` అని హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. పైగా ఆయన కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ లో హాజరవుతానని కోర్టుకే ఆఫర్లు ఇస్తున్నారు.
రాష్ట్రానికి మూడో పెద్ద శక్తి అయిన న్యాయ వ్యవస్థను ఇంత తేలికగా తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం. పవర్ కోల్పోయినా జగన్ అహంకారం తగ్గకపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గంజాయి స్మగ్లర్లను, నేరస్తులను పరామర్శించడానికి సెక్యూరిటీ సమస్య ఉండదు.. కానీ కోర్టుకు వెళ్లడానికి మాత్రం భద్రత, ప్రోటోకాల్ గురించి మాట్లాడటం నిజంగా విడ్డూరమే అని రాజకీయ విశ్లేషకులు ఎగతాళి చేస్తున్నారు.