టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ చివరికి తమ ప్రేమకథకు హ్యాపీ ఎండ్ ఇచ్చే సమయం వచ్చేసింది. 2026 ఫిబ్రవరి 26న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతుందని బాలీవుడ్ మరియు టాలీవుడ్ వర్గాల్లో బలంగా టాక్ నడుస్తోంది. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని విలాసవంతమైన ప్యాలెస్ వేదిక కానుందని సమాచారం.
స్పెషల్‌గా ఎంపిక చేసిన ప్యాలెస్‌లో రాజసంగా జరిగే ఈ పెళ్లి వేడుకలో ప్రముఖ సినీ తారలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయని, ప్రతి ఈవెంట్‌కి ప్రత్యేక థీమ్‌లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ జంట ఇంకా అధికారికంగా పెళ్లి వార్తను ధృవీకరించకపోయినా, అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, రష్మిక–విజయ్ ప్రేమకథ గీత గోవిందం (2018) సెట్స్‌లో మొదలైంది. అప్పటి నుంచి సైలెంట్‌గా కొనసాగిన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటలదాకా చేరింది. గత అక్టోబర్ 3, 2025న హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో ఈ జంట నిశ్చితార్థం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఆ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రానప్పటికీ.. ఇటీవల రష్మిక స్వయంగా తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇన్‌డైరెక్ట్‌గా కన్ఫార్మ్ చేసింది.