జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. హైటెక్ సిటీ మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా ఉండటమే కాకుండా, అన్ని పార్టీలకు ప్రతిష్టా పరీక్షగా మారింది. మునుపటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.
ప్రస్తుతం ఈ సీటును గెలుచుకోవడమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు తమ శక్తిమేర ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
అయితే ప్రచారం పర్వం ముగియకముందే జూబ్లీహిల్స్‌లో ‘నోట్ల వర్షం’ మొదలైంది. సమాచారం ప్రకారం, రెండు ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు బూత్‌ల వారీగా డబ్బు పంపిణీ మొదలుపెట్టేశాయి. మొదట ఒక పార్టీ రూ.2 వేల చొప్పున ఇస్తామంటూ మాటివ్వగా.. మరో పార్టీ దానికి వెయ్యి పెంచి రూ.3 వేల చొప్పున పంచడం మొదలుపెట్టిందని బలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఓటర్ల మధ్య ఆసక్తి, పార్టీల మధ్య ఆందోళన రెండూ పెరిగిపోయాయి.
సాధారణంగా డబ్బు పంపిణీ ప్రచారం ముగిసిన తర్వాత జరుగుతుంటే, ఈసారి మాత్రం ముందుగానే ‘క్యాష్ ఫ్లో’ మొదలైందని తెలుస్తోంది. పోలీస్ తనిఖీలు, ఎలక్షన్ కమిషన్ స్వ్కాడ్ సోదాలు వేగం పెంచడంతో పార్టీలు కూడా కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి. స్థానిక బూత్ కమిటీల ద్వారా, ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, డబ్బు పంపిణీని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాయి. ఓటర్ల రేట్ పెరగడం, పోలీసులు సోదాలు పెరగడం, ప్రచారం వేగం పెరగడం.. మూడు పీక్స్ ఒకేసారి రావడంతో జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయ రంగం గందరగోళంగా మారింది.
ఇకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 3.2 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో సగం మంది పట్టణ ప్రాంతాల హై ఎండ్ ఓటర్లు కాగా, మరో భాగం బస్తీలలో నివసించే మధ్యతరగతి, కూలీ వర్గం ప్రజలు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థల్లో పనిచేసే ఓటర్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో, ఈ సీటు పట్టణ రాజకీయాలకు సూచికగా పరిగణించబడుతోంది. ఈ విభిన్న ఓటర్ల సమూహాన్ని ఆకర్షించడానికి ప్రతి పార్టీ వేర్వేరు టాక్టిక్స్ అవలంబిస్తోంది.