2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం కోసం తెలుగు తమ్ముళ్లు అహర్నిశలు కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. దీంతో, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంతో సంతోషించారు. అయితే, కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పులు వస్తుండడంపై మాత్రం వారు ఏ మాత్రం సంతోషంగా లేరు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సీఎం చంద్రబాబు సైతం ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా పింఛను పంపిణీ చేస్తుంటే...కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు.
ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి గైర్హాజరవుతున్న 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ 48 మందిపై సీరియస్ అయిన చంద్రబాబు వారు పాల్గొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని టీడీపీ ప్రోగ్రాం కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. వారి వివరణ తీసుకున్న అనంతరం అవసరమైతే చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేయబోమని చంద్రబాబు హెచ్చరించారట. టీడీపీ కోసం ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న వారితోపాటు కష్టపడి పని చేసే కార్యకర్తలను కలుపుకుపోవాలని చెప్పారు.